Precautions on Loans | ఇటీవలే సతీశ్ బీటెక్ పూర్తి చేసుకున్నాడు. ప్రముఖ ఐటీ కంపెనీలో కొలువు కూడా దొరికింది.. కొలువులో చేరినందుకు సంస్థ యాజమాన్యం వేతన చెల్లింపునకు బ్యాంక్ ఖాతా తెరుస్తుంది.. వేతన ఖాతా ఉన్న బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌లు కూడా రంగంలోకి దిగుతారు. క్రెడిట్ కార్డుతో ప్రయోజనాలంటూ ఫోన్లు చేస్తూ ఉంటారు. తేలిగ్గా వస్తుందన్న ఆలోచనతో చాలా మంది ఈ క్రెడిట్ కార్డులు తీసేసుకుంటారు..
ఆ క్రెడిట్ కార్డు రావడమే తరువాయి.. ఆలోచనల్లో మార్పులు వచ్చేస్తుంటాయి. అయినా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపునకు 45 రోజుల టైం ఉంటది కదా అని షాపింగ్‌లో కనిపించిన కొత్త వస్తువల్లా కొనేస్తున్నారు సతీష్.. ఇది అలవాటుగా మారిందాయనకు. అంత వరకు బాగానే ఉంటది. నెలవారీగా లెక్క తప్పకుండా క్రెడిట్ బిల్లు చెల్లిస్తే ఇబ్బందులు ఉండవు. కానీ ఆదాయానికి మించి కొనుగోళ్లు చేసే స్థాయికి వెళ్లి.. బిల్లు చెల్లించే స్థోమత లేక కనీస మొత్తం మాత్రమే చెల్లిస్తే.. ఇక రుణాల ఊబిలో కూరుకుపోవడం మొదలైనట్లేనని నిపుణులు చెబుతున్నారు.
ఇలా పేరుకుపోయిన క్రెడిట్ కార్డు బిల్లుల బకాయిలు చెల్లించడానికి కొందరు కొత్త అప్పులు చేస్తుంటారు. క్రెడిట్ కార్డు బిల్లులు బకాయిలు పెరిగిపోవడంతో సిబిల్ స్కోర్ కూడా దెబ్బ తింటుంది. మరి కొంత మంది మున్ముందు ఆదాయం ఎక్కువగా ఉంటుందని.. ముందే భారీ మొత్తంలో అప్పులు చేస్తుంటారు. ఫ్యూచర్ సంగతి పక్కన బెడితే ప్రస్తుతం మన ఆర్థిక స్థితిగతులేమిటో చెక్ చేసుకోవాలి. ఆదాయాన్ని బట్టి మాత్రమే అప్పులు తీసుకోవాలని ఆర్థిక వేత్తలు అంటున్నారు.
బ్యాంకులు రుణాలిస్తున్నాయని అప్పులు తీసుకోరాదని, మీ ఆదాయంలో 20 శాతానికి మించి రుణ వాయిదాలు (ఈఎంఐ) చెల్లించే పరిస్థితి రాకుండా జాగ్రత్త వహిస్తేనే.. భవిష్యత్ కోసం కొంత ఆదా చేయడానికి, ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి వీలు చిక్కుతుందని నిపుణులు చెబుతున్నారు.
తీసుకునే అప్ప వల్ల భవిష్యత్‌లో సంపద పెరుగాలి. ఇంటి రుణం తీసుకుంటే మంచిదే. దీంతో మీ ఆస్తుల జాబితా పెరుగుతుంది. ఒకవేళ అవసరమైతే ఇల్లమ్మి అప్పు బకాయి తీర్చేయవచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వారూ తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అప్పు చేయొచ్చు. లగ్జరీ వస్తువుల కొనుగోలు కోసం, విందులూ విహార యాత్రల కోసం చేసే రుణాలు మీపై ఆర్థిక భారాన్ని మోపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.