ఒకనాడు పాలమూరు దుర్భిక్షాన్ని, దురవస్థను వలపోస్తూ పాడుకున్న పాట.. ఇప్పుడు మళ్లీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది. తలాపున కృష్ణ పారినా.. పొలం పొలమారు తూనే ఉన్నది. అక్కడ ఆంధ్రా సరిహద్దుల దాకా నీళ్లు పారుతుంటే.. కృష్ణానది పక్కనే ఉన్నా పాలమూరు చుక్కనీటి కోసం దిక్కులు చూస్తున్నది. శ్రీశైలానికి ఏకంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం..
కృష్ణా నీళ్లు పట్టుకుపోయి పారిచ్చుకుంటుంటే, 70 కిలోమీటర్ల దూరమైనా లేని జూరాల ఆయకట్టు సాగునీళ్ల కోసం ఎందుకు చేతులెత్తి వేడుకోవాల్సి వస్తున్నది?
చేవలేని, చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రకృతిని నిందిస్తున్నది. తప్పంతా ఎల్ నినోదే అని తప్పించుకోజూస్తున్నది. అనేక దేశాలపై ఎల్ నినో ప్రభావమున్నది. తెలంగాణకే రాలేదు. ఇక్కడికే పరిమితం కాలేదు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ.. కృష్ణమ్మ వరదనీరు ఒడిన నింపుకొని పారింది. ముందుచూపున్న రాష్ర్టాలు జాగ్రత్తపడ్డయ్. కోటాను మించి నీళ్లు పట్టుకుపోయి కాలువలు పారించుకున్నయ్. అందుకే ఎగువన కర్ణాటకలో సాగునీటికి కొరత లేదు. దిగువన ఏపీలోనూ నీళ్ల కరువు రాలేదు. నడిమిట్ల తెలంగాణకే ఎందుకీ అవస్థ? వానల్లేవు. చెరువుల్లో నీళ్లు లేవు. కాలువలకు ఎత్తిపోసేవాడు లేడు. పంటలు ఎండుతున్నయ్. రైతులు నీళ్లు ముట్టకుండా ప్రాజెక్టులన్నీ పోలీసుల పహారాలో ఉన్నయ్. గేట్లెత్తి వదిలేసిన నీళ్లు ఏపీకి పోతున్నయ్. కాదు, రేవంత్ సర్కారే నీళ్లు ధారపోస్తున్నది.
ఈ ఏడాది కృష్ణాలో ఇప్పటివరకు 318 టీఎంసీలు వచ్చాయి. అందులో ఇప్పటివరకు ఏపీ 84 టీఎంసీలను వినియోగించుకున్నది. తెలంగాణ వాడుకున్నది కేవలం 47 టీఎంసీలే. ఒక్క శ్రీశైలం నుంచే ఏపీ 54టీఎంసీలను వినియోగించుకోగా, తెలంగాణ కల్వకుర్తి ద్వారా పట్టుమని 10 టీఎంసీలను ఎత్తలేదు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 21 వరకు జూరాలకు మొత్తంగా 243 టీఎంసీల వరద వస్తే.. వివిధ లిఫ్ట్‌ల ద్వారా తెలంగాణ వాడుకున్నది కేవలం 20 టీఎంసీలే. గురుభక్తో, అశక్తతనో కానీ.. సొంత ఇల్లు గూనలు సదరలేక.. పొరుగు మేడలకు రంగులు మెత్తుతున్నది రేవంత్ సర్కార్. నీటిసోయి లేని నేతల కారణంగా రాష్ట్రం ఎండుతున్నది! కాంగ్రెస్ పాలకుల పాపాలకు పాలమూరు రోదిస్తున్నది.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో నీళ్ల కోసం రైతులు యుద్ధం చేయాల్సి వస్తున్నది. కండ్లముందే పంటలు ఎండిపోతుంటే కడుపు రగిలిన అన్నదాతలు.. వారం రోజుల నుంచి గద్వాల, వనపర్తి జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నీళ్లివ్వకుండా చోద్యం చూసింది. జూరాలలో 8.9 టీఎంసీలు నిల్వ ఉన్నా.. కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల చేసేందుకు సర్కార్ ససేమిరా అనడంతో ఆక్రోశించిన రైతన్నలు.. పంటలను కాపాడుకొనేందుకు హెడ్ రెగ్యులేటరీ వద్దకు చేరి గేట్లను బద్దలు కొట్టి తూములను తెరిచి వాళ్లే స్వయంగా నీటిని వదులుకున్నారు.
ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు గంటలోపే తూము గేట్లను మూసేసి రైతులపై కేసులు పెట్టినా వారు బెదరలేదు. తాజాగా సోమవారం రైతులు ఎక్కడ మళ్లీ ప్రాజెక్టు గేట్లను బద్దలు కొడుతారనే భయంతో గద్వాల, వనపర్తి పోలీసులు ప్రాజెక్టు మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకోవడం, రైతుల ఆందోళనకు మద్దతుగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ‘చలో జూరాల’కు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడే అరెస్టులు చేసి పోలీస్స్టేషన్ల్లకు తరలించారు.
పోలీసుల అడ్డంకులను దాటుకొని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి భారీ ఎత్తున రైతులతో జూరాల ఎడమ కాలువ సమీపంలో నందిమల్ల క్యాంప్‌కు చేరుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు. అప్పటివరకు పొలాలు, గట్ల వెంబడి ఉన్న రైతులంతా ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యేతోపాటు చౌరస్తాలోకి వచ్చి ప్రాజెక్టులోకి రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకొని తరలిస్తుండగా రైతులు పోలీస్ కాన్వాయ్‌కు అడ్డుగా పడుకొని అడుగడుగునా అడ్డుకున్నారు.
మరోవైపు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని పానగల్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అదుపులో తీసుకొనేందుకు ప్రయత్నించగా ఆయన వారించి వనపర్తికి రావడంతో గృహ నిర్బంధంలో ఉంచారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లో పోలీస్ ఎస్కార్ట్‌ను వెంట ఉంచారు. జూరాల ప్రాజెక్టుకు వెళ్లేందుకు యత్నించిన మరో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని మహబూబ్‌నగర్ సమీపంలోని తిరుమల హిల్స్‌లో గృహ నిర్బంధం చేశారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని ఆయన స్వగ్రామం అన్నాసాగర్‌లో, పార్టీ ఇన్చార్జ్ బాసు హనుమంతు నాయుడును గద్వాలలో గృహ నిర్బంధం చేశారు.

గద్వాల కలెక్టరేట్ ముట్టడికి యత్నం..
జూరాల ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయాలని రైతులు పెద్ద సంఖ్యలో గద్వాల కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు తోపులాట జరిగింది. అక్కడినుంచి జమ్మిచెడు గ్రామానికి చేరుకొని గద్వాల-కర్నూలు రహదారిపై సుమారు 6గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. తమ పంటలు ఎండిపోతున్నాయని మహిళా రైతులు అదనపు కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకోవడం కనిపించింది. ఎడమ కాలువ వద్దకు చేరుకొనేందుకు ప్రయత్నించిన రైతులను అదుపులోకి తీసుకుంటుండగా ఓ ఎస్సై రైతు గల్లా పట్టుకుని ఈడ్చుకు వెళ్లాడు. కుడి, ఎడమ కాలువలకు నీళ్లు వదలాలని ధరూర్ రైతులు ఏకంగా కుడి కాలువ దగ్గర ధర్నాకు దిగారు.
ఎడమ కాలువ దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో పోలీసుల కండ్లుగప్పి కొంతమంది రైతులు జూరాల ప్రాజెక్టుపై చేరుకోవడానికి ప్రయత్నించారు. పొలాల నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చిన సుమారు 200మంది రైతులు సమాంతర కెనాల్ లోకి ప్రవేశించి ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. కాలువలోనే నిరసన తెలుపడంతో పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని రైతులందరినీ తరిమికొట్టారు. ఈ ప్రయత్నంలో ఒక రైతు చెయ్యి విరిగింది. జూరాల ఆయకట్టును కాపాడాలని ఒక్కసారిగా రైతుల ధర్నాకు దిగడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్వల్ప లాఠీచార్జ్ చేయగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తడంతో పోలీసులు కూడా చేతులెత్తేయాల్సి వచ్చింది.

24 గంటల్లోగా నీళ్లివ్వాల్సిందే..
సాగునీరు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తే పరిస్థితి చేయి దాటుతుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇరిగేషన్ ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వానికి 24గంటల సమయం ఇస్తున్నామని, ఈ లోగా నీళ్లు విడుదల చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జూరాల ఆయకట్టు రైతులు అల్టిమేటం ఇవ్వడంతో పరిస్థితి ఊహించని విధంగా మారింది. మరోవైపు రైతుల గోసపై జిల్లాకు చెందిన మంత్రి ఒకరు అవగాహన లేకుండా మాట్లాడటంపై రైతులు తిరగబడ్డారు. ఎన్నడూ లేనివిధంగా జూరాల ఆయకట్టు కింద రైతులంతా ఒక్కటే ఆందోళన బాట పట్టడం సాగునీటి కోసం పోరాటం చేయడం అందరిని ఒక్కతాటిపైకి తెచ్చింది. నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఎంపీ అరుణను కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అడ్డుకున్నారు. జూరాల ఆయకట్టు రైతాంగం ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
పోలీసుల కండ్లుగప్పి జూరాల వద్దకు చిట్టెం
జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని కొద్ది రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, రైతులతో కలిసి ప్రాజెక్టు చేరుకొని భారీ ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో వనపర్తి జిల్లా ఆత్మకూర్ అమరచింత నుంచి వెళ్లే మొత్తం రహదారులపై పోలీసులు చెక్‌పోస్టులు పెట్టి జూరాల ప్రాజెక్టు వైపు వెళ్లకుండా కట్టడి చేశారు. అయినా పోలీసుల కండ్లు కప్పి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చెరువు గట్లు, పొలాల మీదుగా ప్రాజెక్టు సమీపానికి చేరుకున్నారు. దీంతో అవాక్కైన పోలీసులు ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యేను చుట్టుముట్టారు.
అప్పటివరకు పొలాల్లో దాక్కున్న రైతులంతా ఒక్కసారిగా నందిమల్ల క్రాస్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అప్పటికే వస్తున్న కొందరు రైతులను అరెస్టు చేసి వ్యాన్‌లో ఎక్కించారు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం.. నీళ్లడిగితే అరెస్టు చేస్తారా అంటూ అక్కడున్న డీఎస్పీ గిరిబాబును నిలదీశారు. పోలీసు నిర్బంధకాండపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని వాహనంలోకి తరలించారు. రైతులు అడుగడుగునా అడ్డుకొని, పోలీస్ కాన్వాయికి అడ్డంగా పడుకున్నారు. సీఎం డౌన్ డౌన్.. జూరాల రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలి.. ఇదేనా ప్రజాపాలన.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆందోళనల నడుమ చివరకు మాజీ ఎమ్మెల్యేను కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

జూరాల కాలువలో రైతుల నిరసన
ప్రమాదమని తెలిసినా తమ ఆవేదన ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు కాలువలోకి దిగి రైతులు నిరసన తెలిపారు. ప్రాజెక్టు వైపు వెళ్లకుండా, నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై అగ్రహం వ్యక్తంచేస్తూ రైతులు పొలాల గట్ల వెంబడి ప్రాజెక్టు వైపు పరుగెత్తారు. వందల సంఖ్యలో రైతులు ప్రాజెక్టు వైపు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న కాలువలోకి దిగారు. అంతటితో ఆగకుండా అటువైపు గట్టుకు వెళ్లడానికి ప్రయత్నించి ఎట్టకేలకు జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ సమీపానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు రైతులను బలవంతంగా వెనక్కి పంపించారు. ఆంధ్రాకు నీళ్లు ఇచ్చి తెలంగాణను ఎండబెడుతారా? అని నిలదీశారు.
రైతు గల్లా పట్టిన ఎస్సై..
జూరాల వద్దకు మస్తీపూర్, మూలమల్ల, నందిమల్ల, ఆరెపల్లి, ధర్మాపూర్ తదితర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న క్రమంలో డ్యూటీలో ఉన్న ఎస్సై అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే లేచి ఒక రైతు గల్లా పట్టుకొని ఈడ్చుకొని రావడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. సమాధానాలు చెప్పే ఇరిగేషన్ అధికారులు లేకుండా పోలీసులను అడ్డుగా ఉంచి రైతులపై ప్రతాపం చూపిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ జులుం నశించాలి అంటూ నిప్పులు చెరిగారు.
పోలీసులపై ఎస్పీ గరంగరం
వనపర్తి పోలీసు యంత్రాంగంపై జిల్లా ఎస్పీ సునీతారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకునే అన్ని ఎంట్రీ పాయింట్లు మూసివేసినా మాజీ ఎమ్మెల్యే చిట్టెంతోపాటు వందలాదిగా రైతులు ఎలా చేరుకున్నారని ఆమె ప్రశ్నించినట్టు సమాచారం. హుటాహుటిన నందిమల్ల క్యాంపు, జూరాల ప్రాజెక్టు ప్రదేశాలను ఎస్పీ పరిశీలించారు. భద్రతా వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక ముందు జరుగకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడేందుకు ఎస్పీ నిరాకరించారు. భద్రత కల్పించడం తమ వంతు.. నీళ్లు విడుదల చేయాలా? లేదా అనే విషయమై ఎలాంటి కామెంట్లు చేయనంటూ దాటవేశారు.




