హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 23: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా, అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులను హత్యానేరం కింద కేసు నమోదు చేసి 24 గంటల్లో రిమాండ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు. రాష్ర్ట కమిటీ పిలుపులో భాగంగా హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేయాలని ధర్నా నిర్వహించారు.
పోలీసుల నిర్లక్ష్యం నశించాలని, అగ్రకుల పెత్తందారులందర్ని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితకుటుంబానికి న్యాయం చేయాలని, కుల దురహంకార హత్యలను ఖండించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దూడపాక రాజేందర్, కుల మతాంతర వివాహితుల వేదిక జిల్లా నాయకులు ఇస్లావత్ రవీందర్, వ్యవస్థాపక సభ్యులు కారు ఉపేందర్, డివైఎఫ్ఐ నాయకులు జంపాల రమేష్, నార్లగిరి కొమురయ్య, కెవిపిఎస్ జిల్లా నాయకులు రేణికుంట్ల చందర్, సిరిమిళ్ల సుభద్ర, నేతగాని భారతి, అయిత మారుతి, శైలజ పాల్గొన్నారు.