హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 6 : కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగాన్వేషకుల నుంచి ఉద్యోగార్థులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇన్నోవేటర్లుగా ఎదగాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూ-హైదరాబాద్ టీహబ్ సంయుక్త నిర్వహణలో విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ‘ఓరియంటేషన్ సెషన్’లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల లక్ష్యసాధనకు టీహబ్, కేహబ్లు శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాయని, ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు తెలిపారు.
రానున్న రెండేళ్లలో విద్యార్థులు ఏ స్థానంలో ఉండాలి, తదనుగుణంగా వారి ఆలోచనలు ఎలా ఉండాలనే అంశాలపై దృష్టి సారిస్తూ, ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్, స్టార్ట్అప్స్ స్థాపనకు టీహబ్, కేహబ్లు సమగ్ర శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కవిద్యార్ధి ప్రారంభంలో సాధారణ వ్యక్తులుగానే ఉంటారని కానీ వారి లక్ష్యాలు, నిబద్ధత, అంకితభావమే వారిని అసాధారణ వ్యక్తులుగా మారుస్తుంద, గ్రామీణ-పట్టణ, ధనిక-పేద అనే భేదాలు ఎలాంటి అడ్డంకులు కావని స్పష్టం చేశారు.
ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా, వారిని భవిష్యత్తులో ఉద్యోగదాతలుగా మార్చేదిశగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మాట్లాడుతూ నూతన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానంతో సమస్యలను విశ్లేషించడం, వాటికి స్థిరమైన వ్యాపార పరిష్కారాలు రూపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచన శక్తి, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.