హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 16: భారతదేశానికి తగిన ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఆహారం, నివాసం, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలు ఇప్పటికీ అత్యంత ప్రాముఖ్యమైనవేనని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ సెనెట్ హాల్లో రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అధ్యక్షతన రెండురోజుల జాతీయ సదస్సు ‘ పాపులిస్ట్ పాలసీస్ ఇన్ పోస్ట్-లిబరలైజేషన్ ఇండియా’ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
సంక్షేమం అవసరమైనప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధి కూడా సమానంగా ముఖ్యమని, దేశంలో ధనిక-పేదల మధ్య అంతరం పెరుగుతున్నదని వివిధ నివేదికలు సూచిస్తున్నాయని తెలిపారు. సహానుభూతితోనే సంక్షేమం ప్రారంభమవుతుందని, దానికి బలమైన ఆధారాలు, సమగ్ర ప్రణాళిక, సమర్థవంతమైన అమలు అవసరమన్నారు. బలహీన వర్గాల అవసరాలను తీర్చేందుకు సంక్షేమ పథకాలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, కొన్ని సందర్భాల్లో అవి ఓటర్లను ఆకర్షించే రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయన్నారు.
ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు డాక్టర్ కే.శ్రీనివాస్ నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో అమలులోకి వచ్చిన సంక్షేమ పథకాల ప్రభావాన్ని విశ్లేషించారు. ఈ విధానాల అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభ పరిస్థితులు పెరిగినప్పటికీ, పారిశ్రామిక వర్గాల్లో ఉత్సాహం నెలకొన్నదని, ఆర్థిక సంస్కరణలకు మానవీయ కోణం అనుసంధానం కావాలని, సంక్షేమం ఆ దృక్కోణంతో ముడిపడి ఉండాలన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగ విశ్రాంత ఆచార్యులు కోదండరామ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుపై విమర్శాత్మక విశ్లేషణ చేశారు. సదస్సులో డీన్ ఆచార్య బి.సురీష్లాల్, సెమినార్ జాయింట్ డైరెక్టర్ సంకినేని వెంకట్, పాఠ్యప్రణాళిక అధ్యక్షుడు గడ్డం కృష్ణయ్య, వి.సత్యనారాయణ, వి.నాగరాజు, విశ్రాంత ఆచార్యులు రఘురాంరెడ్డి, వీరన్ననాయక్, దినేష్‌కుమార్, హరిప్రసాద్, సంజీవరెడ్డి, బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.