హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 23: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 25 నుంచి జరిగే పీజీ పరీక్ష లను వెంటనే తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టిరు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి బొజ్జు జ్యోతి మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు అనేక విద్యా, పరిపాలనా సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు.
సరైన తరగతులు నిర్వహించకపోవడం, సిలబస్ పూర్తికాకపోవడం, హాస్టల్, మౌలిక వసతుల సమస్యలు వంటి అంశాలు విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయని ఆమె మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు అన్యాయమని, వెంటనే విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు నవ్య, కృష్ణవేణి, మమత, శ్వేత, పూజిత పాల్గొన్నారు.