వేలేరు : అనుకోని ప్రమాదంలో అతడి కాలు పోయింది. ఆ తరువాత భార్య కూడా మృతి చెందింది. అయితే రెండున్నర ఏళ్లుగా వికలాంగ పింఛన్ కోసం తిరుగుతున్న పట్టించుకున్న నాధుడు లేడు. దీంతో ఆ దివ్యాంగుడి జీవితం దీనావస్థలో సాగుతోంది. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన కొయ్యడ స్వామి నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ఒక కాలు కోల్పోయాడు. అప్పటి నుండి పింఛన్ కోసం తిరుగుతుండగా నేటికి పింఛన్ మంజూరు కాకపోవడం గమనార్హం.
అయితే పింఛన్ మంజూరు చేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. కాగా కొయ్యడ స్వామికి ఒక కొడుకు ఉండగా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండున్నారేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్ లపై ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం పట్ల పింఛన్ దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వికలాంగ వృద్ధునికి పింఛన్ మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.