Kadiyam Srihari | వేలేరు, జూలై :స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైనే ఎక్కువ వ్యతిరేకత ఉందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య విమర్శించారు. శుక్రవారం వేలేరు మండలం సోడాషపల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. సొంత పార్టీ నాయకులే కడియం శ్రీహరిపై మండిపడుతున్నారని తెలిపారు. అటు సొంత పార్టీలో, ఇటు ప్రతిపక్ష పార్టీలో వ్యతిరేకతను మూటగట్టుకున్న కడియం శ్రీహరి చచ్చిన పాములా తోక ఊపుతున్నాడని అన్నారు. చచ్చిన పాము తోకను కొండా మురళి ఇంకా చంపుతున్నాడని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తలలు పట్టుకుంటుందని అన్నారు. అప్పుల కోసం వెళ్తే చెప్పుల దొంగను చూసినట్లు చూస్తున్నారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సుద్ద దద్దమ్మలే ఇలాంటి మాటలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు టి.రాజయ్య సూచించారు. పల్లెల్లో కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని తెలిపారు. గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు.