ఖిలావరంగల్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వరి సన్న ధాన్యానికి సంబంధించిన పెండింగ్ బోనస్ డబ్బులను తక్షణమే చెల్లించాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా సివిల్ సప్లై డీఎం కార్యాలయం ఎదుట ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించి, అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం రైతులకు చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి సహా పలువురు నేతలు మీడియా ద్వారా బోనస్ డబ్బులు చెల్లిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. గత రెండు సీజన్లుగా వేలాది మంది రైతులకు కోట్లాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, ఈ డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన కోరారు. కుంటి సాకులతో చెల్లింపులు ఆలస్యం చేయడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని విమర్శించారు. అలాగే ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసలతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ మధ్య దళారులు, రైస్ మిల్లర్లు సరైన విధంగా భద్రపరచకుండా అవకతవకలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సక్రమంగా భద్రపరిచి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వినియోగించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చెవ్వ కుమారస్వామి, మహమ్మద్ రఫీ, దేవర రాజు, ఆకారపు బాబు, ముగ్గుల్ల రాజాలు, దొంతి జయపాల్ రెడ్డి, ఆకారపు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.