హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 9: అవినీతి కన్నా.. అడుక్కుతినడం మిన్నా అనే విధంగా నగరంలో బిచ్చగాళ్లతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆలోచింపజేసింది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం హనుమకొండ వేయిస్తంభాల గుడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. బిచ్చమార్జిస్తూ జీవనం సాగించేవారు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్సత్తా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోక్సత్తా ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి సర్వసాధారణంగా మారిపోయిందని, అవినీతి అధికారులను ఏసీబీ పట్టుకుని కేసులు నమోదు చేస్తున్న వారిపై చర్యలు ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సత్తా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, జ్వాలా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారుల జీతభత్యాలు, పింఛన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నా.. ప్రజలకు అవినీతిరహిత సేవలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీకి పట్టుబడిన అధికారులకు మళ్లీ పోస్టింగ్లు ఇస్తున్నారని, ఉద్యోగం ఇవ్వకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. జీతాలు, పింఛన్లు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అడుక్కునే బిచ్చగాళ్ల కంటే హీనమైనస్థితిలో ఉన్నారని అందుకే బిచ్చగాళ్లతో ర్యాలీ నిర్వహించామని సుంకరి ప్రశాంత్ తెలిపారు. బిచ్చగాళ్లతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆలోచింపజేసింది నిజంగా.. అవినీతిపరుల కంటే బిచ్చగాడులే నయం అని ప్రజలు చర్చించుకున్నారు.