మహదేవ్పూర్ మే 2: అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. సగం పంటలు సాగునీరు అందక ఎండిపోగా, మరికొంత పంట అకాల వర్షానికి తడిసి ముద్దయింది. మండలంలో గురువారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. సుమారు రెండు గంటలపాటు ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మండలం లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు వృక్షాలు నేలకొరిగాయి. కరెంట్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికందిన పంట నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.