హనుమకొండ, జూలై 09 : మత్తు పదార్థాల నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చి, డ్రగ్స్ రహిత భారత్ – డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ ఐడీఓసీ (కలెక్టరేట్)కు చేరుకున్న గవర్నర్కు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్ – డ్రగ్స్ రహిత తెలంగాణ’ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరిస్తూ రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మత్తు రహిత సమాజ నిర్మాణం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి కుటుంబం, ప్రతి సమాజం, ప్రతి వ్యక్తి బాధ్యత అని స్పష్టం చేశారు. మా ఇంట్లో మత్తు పదార్థాలకు చోటు లేదు అనే సంకల్పాన్ని ప్రతి కుటుంబం చేసుకుంటే సమాజం మొత్తం మత్తు రహితంగా మారుతుందని గవర్నర్ పేర్కొన్నారు. మార్పు ఎప్పుడూ మన నుంచే ప్రారంభం కావాలని, ప్రతి ఒక్కరూ ముందుగా తాము మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజాన్ని కూడా ఆ దిశగా నడిపించాలని సూచించారు.
కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, జిడబ్లుఎంసి కమిషనర్ వెంకన్న, ప్రజాప్రతినిధులు, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, వై వి గణేష్, డిసిపి ధార కవిత పాల్గొన్నారు.