రేగొండ, సెప్టెంబరు 29 : రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ పండుగ పూట సైతం రైతులు రోడ్డెక్కారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. రేగొండ వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
కేవలం 400 బస్తాలే ఉండడంతో పంపిణీని నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పడంతో విరమించారు. పండుగ పూట కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో దాపరించిందంటూ రైతులు శాపనార్థాలు పెడుతూ వెనుదిరిగారు.