భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేటి (సోమవారం) నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దేవరాజం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 02వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఈ పరీక్షలకు మొత్తము 1915 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొవడానికి ఆయా రూట్లలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారుల సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు చేశామని, పరీక్ష కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పకుండ మాస్కు ధరించాలని, ఆరోగ్యశాఖ సిబ్బందినీ అన్నీ పరీక్ష కేంద్రాల్లో నియమించడం జరిగిందని, జలుబు, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలు ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయడానికి ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షల పర్యవేక్షణ కొరకు జిల్లాలో డీఈసీ కమిటీ, ప్లెయింగ్ స్కాడ్ టీం, ఇద్దరు సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామని, ఎక్కడ మాస్ కాపియింగ్ జరుగకుండా పగడ్బందీగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.