హనుమకొండ చౌరస్తా, మార్చి 31: కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో 400 ఎకరాల భూమిని వేలం వేయడం ఆపాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి డిమాండ్ చేశారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ రెండో గేట్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ఆపాలని, విద్యార్థులపై లాఠీచార్జీని నిరశిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రభుత్వ భూములను వేలం వేస్తూ కార్పొరేటు సంస్థలకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరించద్దని, నిరసన తెలిపే హక్కును క్కిపడేసే ప్రయత్నం చేస్తుందని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం సమంజసం కాదన్నారు. యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వం, అలా చేయకుండా భూములను అమ్మే ప్రయత్నం చేస్తుందన్నారు. భవిష్యత్తు విద్యార్థుల కోసం ఉపయోగపడే విశ్వవిద్యాలయాల భూమిని వేలం వేయకుండా ఆపాలని, జేసీబీలను వెనక్కి పంపాలని శాంతియూత వాతావరణం నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్, జిల్లా సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి, డివైఎఫ్ఐ నాయకులు వేలు సన్నీ, రమణారెడ్డి, రమేష్, శ్రీకాంత్, చంటి పాల్గొన్నారు.