న్యూశాయంపేట, ఏప్రిల్ 19: ఎల్కతుర్తిలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) పిలుపునిచ్చారు. శనివారం న్యూశాయంపేట జంక్షన్ నుంచి రైల్వే గేట్ వరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు వినయ్ భాస్కర్‌కు రూ.లక్ష 30 వేలు విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలాగైతే పిల్లాపాపలతో వస్తారో.. పార్టీ రజతోత్సవ సభకు కూడా అలాగే తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. వడ్డేపల్లి పుట్టినిల్లు అయితే న్యూశాయంపేట తనను పెంచిన గడ్డ అని, రాజకీయ జన్మనిచ్చిందని చెప్పారు. ఎప్పడు ఎన్నికల్లో పోటీ చేసినా న్యూశాయంపేట ప్రజలు తనను ఒక కుటుంబ సభ్యుడిగా భావించి విరాళాలు ఇచ్చారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవాల నేపథ్యంలో కార్యక్రమాల నిమిత్తం విరాళం అందజేసిన కార్యకర్తలను అభినందించారు. కేసీఆర్ హయాంలో దేశంలోనే రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. తెలంగాణ కోసం నాడు, నేడు, రేపు పోరాడేది, కొట్లాడేది బీఆర్ఎస్, గులాబీ సైనికులు మాత్రమేనని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జానకిరాములు, కొడెం సంపత్, గుండు సదానందం, ఫాతిమా చారి, వెంకటేశ్వర్లు, రాజు, వెంకన్న, రాకేష్ యాదవ్, సృజన్, వేల్పుల సందీప్, వినయ్ పాల్గొన్నారు.