కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 10: కార్పొరేట్ సంస్థల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తుందని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్రం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్యాస్ సిలిండర్ను ఎత్తి వినూత్నంగా నిరసన వ్యక్తం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ పాలనలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు. రోజురోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్యుడు నిత్యావసర ధరలను కూడా కొనలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బడా పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడి దారుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ, పేదల నడ్డి విరుస్తున్నదని, బీజేపీని గద్దె దించకపోతే దేశం అదొగతిపాలవుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా కేంద్రం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేసారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, నేరెళ్ల రమేష్, జీ. నగేష్, భూక్యా శ్రీను, మామిడాల ధన లక్ష్మి, రత్న కుమారి, దార్ల లక్ష్మి, సునీత, కైసర్, ష మీమ్, మెరుగు అనసుర్య, వీణ, విజయ్, పిడుగు శ్రీను, పాటి మోహన్, కూరపాటి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి..
గ్యాస్ ధరలపై పెంపుపై సీపీఎం నాయకులు కూడా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదల పొట్ట కొట్టే నిర్ణయాలను కేంద్రం తీసుకోవడం బాధాకరమని అన్నారు. సామాన్యుడు గ్యాస్ సిలిండర్ కొనే పరిస్థితి లేదన్నారు. పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను బేషరతుగా తగ్గించాలని లేని పక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.