భీమదేవరపల్లి, మే 06: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నియమించిన కమిటీల్లో సభ్యులు పాత్ర నామమాత్రమేనని, వారితో సంబంధం లేకుండా జాబితాలను రూపొందిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తమ తల్లి హేమలతను ఇందిరమ్మ కమిటీలో మెంబర్‌ను చేశారని, తమ ప్రమేయం లేకుండానే ఇండ్ల జాబితా రూపొందించారని హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నలివెల దిలీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు బడుగు బలహీన వర్గాల బిడ్డ పొన్నం ప్రభాకర్‌కు అండగా ఉందామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చానని, అందరితో కలిసి కష్టపడి పని చేశానని చెప్పారు.
కాలక్రమేన ఏమి జరుగుతుందో తెలియదు కానీ ఓర్వలేని కొన్ని దుష్టశక్తులు కావాలని దూరం పెట్టే ప్రయత్నం చేయడం తనను బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కన్నా మానవతా సంబంధాలే ముఖ్యమని నమ్మే వ్యక్తిగా తాను, తన కుటుంబ సభ్యులు ఎవరిని దూషించడం లేదన్నారు. ఇందిరమ్మ కమిటీలో తన తల్లికి అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో ఆమె పాత్ర గాని, తన పాత్ర గాని ఏమి లేకుండా నామమాత్రంగా కమిటీ సభ్యులుగా ప్రకటించారని విమర్శించారు. మమ్మల్ని సంప్రదించకుండానే ఇందిరమ్మ ఇండ్ల జాబితా రూపొందించారన్నారు.
ఇందిరమ్మ జాబితాలో పేర్లు వచ్చిన వారికి తాము వ్యతిరేకం కాదని, అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తించాలని కోరుకుంటున్నామని చెప్పారు. నామమాత్రంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా తమ తల్లి పేరును చేర్చి మా ఆత్మాభిమానం దెబ్బతీసిన వారి దగ్గర తాము ఇమడలేక పోతున్నామని కలత చెందారు. మేము ఎవరిని ద్వేషించడం లేదని, గ్రామ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇకనుంచి ఇందిరమ్మ ఇండ్ల కమిటీతో తమకు గానీ, మా కుటుంబానికి గానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. గ్రామస్తులు అర్థం చేసుకోవాలని అంతులేని మనోవేదనతో ఆయన విజ్ఞప్తి చేశారు.