కాజీపేట, ఆగస్టు 11: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బాలసముద్రంలో ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లు(Double bedroom houses) అనర్హులకు కేటాయించారని కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త మద్దెల శోభారాణి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో చాలావరకు అనర్హులకు కేటాయించారన్నారు.
తాను గత 30ఏళ్లుగా కాజీపేట పట్టణం 62 డివిజన్లో కుటుంబంతో అద్దె ఇంట్లో నివాసము ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. ఇటీవల జరిగిన పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసంతో పాటు, వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004 లో సీఎంగా ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడి అసెంబ్లీ, పార్లమెంటు కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డానని పేర్కొన్నారు. అందరిలాగే తాను కూడా స్థానిక కార్పొరేటర్‌తో ఇందిరమ్మ డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు కోసం స్థానిక ఎమ్మెల్యేకు సిఫారసు చేశానని తెలిపారు. ఇండ్ల పంపిణీలో తన పేరును లిస్టు నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత ఇల్లు లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసినా నాకు మాత్రం డబల్ బెడ్ రూం ఇల్లు కేటాయించ లేదని తెలిపింది. స్థానిక ఎమ్మెల్యేకు బినామీలుగా ఉంటున్న వారికి, డబ్బులు తీసుకొని ఉద్యోగులకు సైతం కేటాయించారన్నారు. పట్టణంలో చాలామంది అనర్హులుగా ఉన్నవారికి డబల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించారని వాపోయింది. స్థానిక ఎమ్మెల్యే కేటాయించిన ఇండ్లలో సొంత ఇల్లు ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేశారన్నారు.
మాలాంటి పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్ట పడినందుకు మమ్ములను గుర్తించ లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బినామీలు, డబ్బులు ఇచ్చిన వారికే మూడు నాలుగు ఇండ్ల కేటాయింపు జరగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పునర్ ఆలోచించి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కాగా, సొంత పార్టీ నేతల నుంచే ఇందిరమ్మ ఇండ్లపై వ్యతిరేకత రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.