హనుమకొండ చౌరస్తా, జూన్ 9: ఓట్లు దండుకునేందుకు అమలు గాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రెండున్నరేళ్లలో ప్రజలకు చేసిందేమీలేదని, ఇప్పుడు ఊర్లకు పోతే కాంగ్రెస్ వాళ్లను తన్నితన్ని ఉరికిస్తారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండలోని 7, 10 డివిజన్ల బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశాన్ని పులి రజినీకాంత్ అధ్యక్షతన మంగళవారం కాపువాడలోని శ్రీమాతా గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని మండిపడ్డారు.
కక్షపూరితంగా బీజేపీకి అనుకూలంగాలేని ఓటర్లను తొలగిస్తుందని, అధికారంలోకి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేయని ఆ వర్గాల ఓట్లను మూకుముడిగా తొలగిస్తుందని, కేసీఆర్ అన్ని వర్గాలను, మతాలను గౌరవిస్తూ వారి సంక్షేమానికి కృషి చేశారని గుర్తుచేశారు. కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా అంకితంగా పనిచేయాలని, బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయాలని మళ్లీ కేసీఆర్ రావాలంటే చేసిన ఇచ్చిన సంక్షేమ పథకాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కబ్జాలు చేయడం వలన నగరానికి వరద వచ్చిందన్నారు. వచ్చేనెల నుంచి డివిజన్లలో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు, గడపగడపకు తిరిగి కాంగ్రెస్ వ్యతిరేక పాలన గురించి తెలియజేయాలని పిలుపునిచ్చారు.
7వ డివిజన్లో ఓట్లు, కోట్లు చాలా కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. అరెస్టులు, కేసులకు భయపడేదిలేదు కేసులు, అరెస్టులకు భయపడేది లేదని, నాయస్థానంపై తమకు నమ్మకం ఉందని వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్ నుంచే గులాబీ జెండా ఎగురవేస్తామని వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కచ్చితంగా పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్స్ అప్రమత్తంగా ఉండి ఓటరు మ్యాపింగ్ చేపట్టాలి, బూత్‌స్థాయిలో ఓటర్లకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయాలి నేను ఎప్పుడు ప్రజలతో, ప్రజల కోసమే ఉన్నా, డివిజన్ వారీగా స్థానిక సమస్యలపై చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉడుతల సారంగపాణి, సీనియర్ నాయకులు నాయీముద్దీన్, ఎండి ఖలీల్, హైమావతి, సుదర్శన్, ఈశ్వర్, పొదిలి అనిల్, వరుణ్, సుధాకర్, డివిజన్ ఇంచార్జ్ విజయ్, రవీందర్ పాల్గొన్నారు.