నకిలీ మొబైల్ ఫోన్ల క్రయ విక్రయాలు, మొబైల్ ఫోన్ దొంగతనాలు అరికట్టడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు 2023, మే నెలలో www.ceir.gov.in (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ పోర్టల్ ప్రారంభంలోనే వేల సంఖ్యలో పోయిన పోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఈ పోర్టల్ ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని పోలీసులే స్వయంగా చెబుతూ వచ్చారు. ప్రారంభంలో ప్రజల జీవన విధానంలో సెల్‌ఫోన్ నేడు నిత్యావసర వస్తువుల జాబితాలోకి చేరిపోయింది. సెల్ఫోన్లోనే వ్యక్తి డేటా, బ్యాంకు వివరాలు, విజ్ఞానం, వినోదం ఇలా అన్ని విషయాలు అందులోనే ఉంటాయని కాబట్టి.. సెల్‌ఫోన్ పోతే.. విలవిలాడుతుంటారు. సెల్‌ఫోన్ పోయిందంటే సీఈఐఆర్ వెబ్‌సైట్‌పైన మాత్రమే పూర్తిగా ఆధారపడుతున్నారు.
ఇక బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే కొందరు సరైన సమాధానం చెబుతారు.. మరికొందరైతే ఇక్కడ సెల్‌ఫోన్ కేసులు తీసుకోబోమంటూ తిప్పి పంపిస్తున్నారు. ఇలా ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి రోజూ వందలాది ఫోన్లు మాయమవుతుండడంతో బాధితుల గగ్గొలు పెడుతున్నారు. కొందరు తెలిసిన వారు నేరుగా సీఈఐఆర్ పోర్టల్‌కు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేస్తుంటే.. మరికొందరు పోలీస్స్టేషన్లకు వెళ్తూ ఫిర్యాదులు చేస్తున్నారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ)
పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ రికవరీ ప్రోగ్రెస్‌ను పరిశీలిస్తూ వచ్చారు. ఈ ఉత్సాహం ముచ్చటగా మూణ్ణాళ్లే అన్న చందంగా మారిపోయింది. ఆ తరువాత ఆరు నెలలకోసారి భారీ ఎత్తున ఫోన్లు రికవరీ చేసి హడావుడి చేశారు. ఇక కొన్నాళ్ల నుంచి ఈ విషయాన్ని పక్కన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడక్కడ పదుల సంఖ్యలో ఫోన్లు రికవరీ చేశామంటూ చెబుతున్నారు. అయితే ఫోన్లు మాయం కావడం మాత్రం తగ్గలేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోన్లు దొంగిలించే ముఠాలపై అంతాగా క్షేత్ర స్థాయి పోలీసులు దృష్టి పెట్టడం మానేశారనే విమర్శలు వస్తున్నాయి. అయితే గతంలో సెల్‌ఫోన్ చోరీ చేసే అంతరాష్ట్ర, అంతర్జాతీయ ముఠాలను సైతం పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ ఫోన్లు కొట్టేసి దేశ సరిహద్దులు దాటేయిస్తున్న ముఠాలను సైతం అరెస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి.
బాధితులు ఆశగా పోలీస్‌స్టేషన్ మెట్లెక్కితే.. సెల్‌ఫోన్ ఫిర్యాదు తీసుకోవడానికి కొందరు సిబ్బంది నిరాకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితులకు సంబంధించిన ఫిర్యాదును అక్కడే ఉండి సీఈఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయించాలి, ఇలా కొందరు చేయిస్తున్నా, మరికొందరు మాత్రం ‘మేం ఇక్కడ ఈ ఫిర్యాదులు తీసుకోం, మీరు వెబ్సైట్లో ఫిర్యాదు చేసుకోండి లేదంటే మీ ఇష్టం’ అంటూ నిర్మోహమాటంగా చెప్పి పంపిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన సెల్ఫోన్లను ఐఎంఈఐ నంబర్ ఆధారంగానే పోలీసులు పట్టుకుంటారు. ఆ వెబ్సైట్ ద్వారా ఐఎంఈఐ నంబర్‌ను ట్రాక్ చేస్తూ దొంగలను పట్టుకుంటారు. అపహరించిన ఫోన్లను దొంగలు ఓపెన్ చేస్తేనే ఆయా ఫోన్లు పోలీసులకు దొరికేందుకు ఈ పోర్టల్ ద్వారా అవకాశముంటుంది. అయితే పోలీసులు కేవలం ఈ వెబ్సైట్పైనే ఆధారపడి, ఆసలు దొంగల విషయాన్ని పక్కన పెట్టేయడంతో దొంగలు కూడా రెచ్చిపోతున్నారు.
నడుచుకుంటూ వెళ్లే వారి చేతిలో నుంచి, బస్సెక్కుతున్న ప్రయాణికుడి జేబులో నుంచి ఒంటిరిగా రోడ్డుపై ఉండే వారిని బెదిరించి ఇలా పలు రకాలుగా సెల్ఫోన్లను చోరీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. దొంగలు సైతం పోలీసులకు చిక్కకుండా ఉ ండేలా స్కెచ్ వేస్తున్నారు. ఇందుకు సెల్‌ఫోన్ ఓపెన్ చేయకుంటే సరిపోతుందనే ధీమాతో ఆయా ఫోన్లను తక్కువ ధరకు దొంగల ముఠాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టెక్నాలజీ మారుతుంది.. అందుకు తగ్గట్టుగా పోలీసులు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంటుందని సామాన్య ప్రజలు సూచిస్తున్నారు. ఉన్నతాధికారులు సెల్‌ఫోన్ చోరీ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకొని దొంగల ఆటకట్టించడం, పోయిన ఫోన్లను రికవరీ చేయడంపై దృష్టి సారించాలంటూ ప్రజలు కోరుతున్నారు.