ఖిలావరంగల్: పీఎం ముద్రా లోన్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధిలో ఆదర్శంగా నిలిచిన మట్టెవాడకు చెందిన మొగిలి శ్రీదేవిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రత్యేకంగా అభినందించారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో క్యాంటిన్‌ను విజయవంతంగా నిర్వహిస్తూ, మహిళా పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన శ్రీదేవి, ఇటీవల జనవరి 26న న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక స్వీకరించారు.
ఈ ఘనత సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం ముద్రా లోన్ ద్వారా స్వయం ఉపాధిని సాధించడమే కాకుండా ఇతర మహిళలకు ప్రేరణగా నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆమె పిలుపునిచ్చారు. శ్రీదేవి సాధించిన విజయం జిల్లాలోని యువతకు, ముఖ్యంగా మహిళలకు ఆదర్శమని, ఇటువంటి ప్రయత్నాలు మరింతమందికి ప్రేరణ కలిగిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.