Weight Loss | బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు సాధారణంగా అల్పాహారంపై ఎక్కువ దృష్టి పెడతారు. అయితే మధ్యాహ్న భోజనం కూడా అంతే ముఖ్యమైంది. సరైన ఆహారాన్ని మధ్యాహ్న భోజనంలో చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి, అధికంగా తినే అలవాటు తగ్గుతుంది. దీంతో బరువు నియంత్రణ మరింత సులభతరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గే లక్ష్యంతో ఉన్నవారు మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలను చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. గోధుమ రొట్టెలు, హోల్ వీట్ శాండ్విచ్లు లేదా ఓట్స్‌తో చేసిన వంటకాలు తీసుకోవచ్చు. ఇవి ఎక్కువసేపు ఆకలి అవకుండా ఉంచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచి రోజులో మిగిలిన సమయానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అయితే ఉదయం అల్పాహారంలో ఇప్పటికే తగిన మోతాదులో తృణధాన్యాలను తీసుకున్నట్లయితే మధ్యాహ్నం వాటి పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు.
కూరగాయలు కూడా బరువు తగ్గే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవే. ముఖ్యంగా బ్రోకోలీ, కాలీఫ్లవర్, పాలకూర వంటి కూరగాయలు పోషకాలతో సమృద్ధిగా ఉండటంతో పాటు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. వీటిని ఉడికించి తీసుకోవడం మరింత ప్రయోజనకరమని సూచిస్తున్నారు. అలాగే టమాటా, దోసకాయ వంటి కూరగాయలతో సలాడ్ తయారు చేసుకోవచ్చు. అయితే సలాడ్‌లో మయోనైస్ వంటి అధిక కొవ్వు పదార్థాలు కలిగిన డ్రెస్సింగ్లను ఉపయోగించకుండా ఉండటం మంచిది. మధ్యాహ్న భోజనంలో లీన్ ప్రోటీన్లు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చికెన్, ట్యూనా, టర్కీ వంటి మాంసాహార పదార్థాలు లేదా శాకాహారులు బీన్స్, టోఫు, పప్పుధాన్యాలను తీసుకోవచ్చు. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగించి, సాయంత్రం చేసే వ్యాయామాలకు అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడతాయి.
ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలను కూడా మధ్యాహ్న భోజనంలో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. పెరుగు లేదా యోగర్ట్ వంటి ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తరచూ గ్యాస్, అజీర్ణం లేదా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు భోజనంతోపాటు ఒక గిన్నె రైతా తీసుకోవచ్చు. ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, ఆరోగ్యకరమైన పేగులు బరువు తగ్గే ప్రక్రియకు తోడ్పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.