హనుమకొండ, ఏప్రిల్ 29 : భద్రకాళి చెరువు పూడికతీత పనులు మరింత వేగవంతంగా సాగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం భద్రకాళి చెరువు పూడికతీత మట్టిని డంపింగ్ చేయడానికి ప్రతిపాదిత ప్రభుత్వ స్థలాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూడికతీత పనులకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించి వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పూడికతీత మట్టిని డంపింగ్ చేసేందుకు ప్రతిపాదిత డంపింగ్ స్థలాలను కలెక్టర్లు అధికారులు పరిశీలించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో భద్రకాళి చెరువు పూడికతీత పనులను మరింత వేగవంతం చేయడంపై సంబంధిత శాఖల అధికారులతో ఇరు జిల్లాల కలెక్టర్లు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో భాగంగా బ్లాకుల వారీగా మట్టిని తీసి బయటకు పంపించాలన్నారు. గడువులోగా పూడికతీత మట్టి తరలింపునకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎ. వెంకట్రెడ్డి, హనుమకొండ,వరంగల్ ఆర్డీవోలు రాథోడ్ రమేష్, సత్యపాల్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ శంకర్, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, అధికారులు పాల్గొన్నారు.