హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 13 : యోగా శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే మార్గమని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. ప్రజాపాలన-పురోగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా యోగాసనాలు చేసి పాల్గొన్నవారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగమని, ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన జీవన విధానమని తెలిపారు.
నేడు యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, అన్ని దేశాల్లో ప్రజలు దీనిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. యోగ కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, మనసు, ఆలోచనలు, జీవనశైలిని సానుకూల దిశగా మలిచే శక్తివంతమైన సాధనమని కలెక్టర్ అన్నారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తగ్గి, శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత లభిస్తాయని వివరించారు.