హనుమకొండ చౌరస్తా, మార్చి 6: హనుమకొండలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శుక్రవారం పరిశీలించారు. పూల్ పరిసరాల్లో జరుగుతున్న మరమ్మత్తులు, సౌకర్యాల అభివృద్ధి పనులను సమీక్షిస్తూ ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. సిమ్మింగ్ పూల్ పనులపై హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోత్ అశోక్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. స్విమ్మింగ్ పూల్‌ను ప్రజలకు మరింత ఉపయోగకరంగా మార్చేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పూల్‌కు వచ్చే యువత, విద్యార్థులు, క్రీడాకారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పూల్ నిర్వహణలో ప్రమాణాలు పాటిస్తూ క్రీడాకారులు సురక్షితంగా సాధన చేయడానికి అనుకూల పరిస్థితులు కల్పించాలని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణచేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పూల్ పరిసరాలను ప్రత్యక్షంగా పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. అవసరమైన చోట మరమ్మత్తులు వెంటనే చేపట్టి స్విమ్మింగ్ పూల్‌ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో డీవైఎస్వో గుగులోతు అశోక్‌కుమార్, సంబంధిత శాఖల ఇంజనీర్లు, కోచ్‌లు, సిబ్బంది ఉన్నారు.