హనుమకొండ చౌరస్తా, జూలై 14: ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు స్థూపం, స్మృతివనం, వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ(ఎమ్మార్పీఎస్-టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు చిటుపాక ప్రభాకర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, నిరుపేద మాదిగ కుటుంబాలకు 200 గజాల స్థలం కేటాయించి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చెప్పులు కుట్టుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద మాదిగలకు నెలకు రూ.3 వేలు పింఛన్ అధించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల కేటాయింపును పెంచాలని, మాదిగ ఎస్సీ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు విల్సన్, రమేశ్, బొక్కల వెంకటస్వామి, ఎడ్ల ఉపేందర్, కల్లకొండ్ల రమేశ్, ఎడ్ల సమ్మయ్య, దసారపు సారన్న, మహిపాల్, చిరంజీవి, మచ్చ వేణు తదితరులు పాల్గొన్నారు.