Spider Man Brand New Day | మార్వెల్ బ్లాక్‌బస్టర్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లోనే రూ. 10,925 కోట్ల భారీ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. కేవలం ఐదు రోజుల్లోనే బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ తర్వాత, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రెండవ చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది. ఇక భారత్‌లోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ. 362.61 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, నెట్ వసూళ్లు రూ. 303.25 కోట్లకు చేరాయి. ఓవర్సీస్ మార్కెట్ల నుంచి రూ. 6,650 కోట్లను రాబట్టిన ఈ సినిమా, మొత్తం లక్షకు పైగా షోలతో ఈ ఘనత సాధించింది.
భారతీయ మార్కెట్లో వీకెండ్ ముగిసినప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల జోరు అస్సలు తగ్గలేదు. తొలి వారాంతంలో భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, వర్కింగ్ డేస్‌లోనూ అద్భుతమైన హోల్డ్‌ను నిలబెట్టుకుంది. సోమవారం రూ. 23.80 కోట్లు రాబట్టగా, మంగళవారం కేవలం 9.7 శాతం స్వల్ప తగ్గుదలతో రూ. 21.50 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. హాలీవుడ్ చిత్రానికి వర్కింగ్ డేస్‌లో ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషం. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ ఊహించని విధంగా భారీ వసూళ్లను సాధిస్తోంది. మంగళవారం నాటి కలెక్షన్లలో ఇంగ్లీష్ వెర్షన్ రూ. 11.50 కోట్లు రాబట్టగా, హిందీ వెర్షన్ రూ. 8 కోట్లు, తమిళ వెర్షన్ రూ. 1.20 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 75 లక్షలు, కన్నడ-మలయాళ వెర్షన్లు కలిపి రూ. 5 లక్షలు వసూలు చేశాయి. హిందీలో ఏకంగా 82 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడంతో మాస్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా 1 బిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ (5 రోజులు) మొదటి స్థానంలో ఉండగా, ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (6 రోజులు) రెండవ స్థానంలో నిలిచింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలైన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రికార్డులను బ్రేక్ చేసే దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల మార్క్‌ను తాకిన తొలి స్పైడర్-మ్యాన్ సినిమాగా ఇది చరిత్ర సృష్టించే అవకాశాలున్నాయి.