ధర్మసాగర్ : వేసవి కాలంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ధర్మసాగర్ లోని నీటి శుద్ధీకరణ కేంద్రాలను, వరంగల్, హన్మకొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా వాటర్ లభ్యతను గురించి అధికారులను అడుగగా టీఎంసీ నీటి నిల్వలు అందుబాటులో ఉంటే కనీసం 3 నెలల పాటు నగర అవసరాలకు సరిపోతాయని తెలిపారు.
రిజర్వాయర్లో గల వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను పరిశీలించిన కలెక్టర్ నగర పరిధిలో పునరుద్ధరించడానికి గల అవకాశాలను పరిశీలించాలని జిడబ్ల్యుఎంసి ఇంజినీరింగ్ అధికారులను సూచించారు. ఇరిగేషన్ ఫేజ్ 3లో భాగంగా దేవాదుల నుండి ధర్మసాగర్ వచ్చే నీటి సరఫరా తీరును పరిశీలించి అక్కడి నుండి చేరే నీటి పరిమాణాన్ని అడిగి తెలుసుకున్నారు. నీటి నాణ్యత ను నిర్ధారించే విధానాలను ల్యాబ్ లో ప్రత్యక్షం గా పరిశీలించి, నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని, మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ రామాంజనేయులు, ఎన్ఐటి మాజీ ప్రొఫెసర్ డా.పాండురంగారావు, ఇరిగేషన్ ఈఈ మంగీ లాల్, తహశీల్దార్ సదానందం, ఎంపిడివో అనిల్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.