హనుమకొండ, జులై 04 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కాకతీయ యూనివర్సిటీ భూమిని కేటాయించడం అన్యాయం అని, కేయూ భూముల జోలికి రానొద్దని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శరత్ చంద్ర అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శరత్చంద్ర మాట్లాడుతూ గతంలో కేయూ భూములపై జరిపిన సర్వే వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు. కేయూ పాలక మండలి అనుమతి లేకుండానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం భూమిని కేటాయించినట్లు ప్రభుత్వం, స్థానిక నాయకులు ప్రకటించడం యూనివర్సిటీ అస్థిత్వాన్ని దెబ్బతీయటమే అని విమర్శించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కేయూ భూములను ఇవ్వనీయబోమని విద్యార్థుల తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ భూముల్లో కళాశాలల భవనాలను నిర్మాణం చేస్తామంటే నాటి కాంగ్రెస్ వ్యతిరేకించిదని, మరి నేడు ఎలా యూనివర్సిటీ భూముల్లో స్కూల్ నిర్మాణం చేపట్టే ప్రయత్నం.. కాంగ్రెస్ ద్వంద నీతికి నిదర్శనం అని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని కేయూ పక్కనే ఉన్న టీబీ హాస్పిటల్ ప్రాంతంలో నిర్మిస్తే బాగుంటుందని సూచించారు.
కేయూ స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటాం
కాకతీయ యూనివర్సిటీ అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని, యూనివర్సిటీ భూమిని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేటాయించడం దానిలో భాగమేనని బీఆర్ఎస్వీ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్ ఆరోపించారు. కేయూ భూములను ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేటాయించడానికి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేయూ వీసీ, పాలకమండ సభ్యులు ప్రభుత్వానికి వత్తాసు పాడుతున్నారని, యూనివర్సిటీ ఛాన్స్లర్ అయిన గవర్నర్ నెల 7న కాకతీయ యూనివర్సిటీకి రానున్నారని, యూనివర్సిటీకి వారు వచ్చేముందు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేయూ భూములను కేటాయించిన ఉత్తర్వులను రద్దుచేసి రావాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో కేయూ స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రాజగోపాల్, వీరస్వామి, ఆర్ కే నరేంద్ర, స్నేహిత్, తదితరులు పాల్గొన్నారు.