భీమదేవరపల్లి, జూన్ 28: మౌనముని, భారతరత్న పీవీ నరసింహారావు (PV Narasimha Rao) భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని భీమదేవరపల్లి తహశీల్దార్ రాజేష్ అన్నారు. శనివారం మండలంలోని వంగరలో పీవీ 104వ జయంతి వేడుకలు పీవీ సోదరుని కుమారుడు మదన్ మోహన్ రావు అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహశీల్దార్ రాజేశ్ మాట్లాడుతూ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో పీవీ నరసింహారావు ప్రధానిగా పగ్గాలు చేపట్టారని తెలిపారు సరళీకృత ఆర్థిక విధానం ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థిక బాటలో పయనింపజేశారని కొనియాడారు. అంగారిన వర్గాలకు కార్పొరేట్ తరహాలో విద్యను అందించాలనే దృక్పథంతో నవోదయ పాఠశాలలను నెలకొల్పిన ఘనత పీవీకే దక్కుతుందన్నారు.
భూ సంస్కరణలను ప్రవేశపెట్టి కొంతమంది చేతుల్లోనే పెద్ద ఎత్తున భూములు ఉండకుండా చేశారని ప్రశంసించారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు పీవీ అన్నారు. పీవీ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, నాయకులు చిట్టెంపెల్లి ఐలయ్య, ఊసకోయిల ప్రకాష్, గోపాల్ రెడ్డి, శ్రీరామోజు మొండయ్య, చిట్టి సతీష్ రెడ్డి, కండె సుధాకర్, తాళ్లపల్లి సదానందం, ఆర్ వెంకటరెడ్డి, గజ్జల రమేష్, మాట్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.