హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 10: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయంలో నిర్వహించనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, పోలీస్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను సందర్శించి, భక్తులకు అందించే సౌకర్యాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి వసతి, విద్యుత్ సరఫరా తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రుద్రేశ్వరస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించగా, పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
భక్తుల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని, ఉత్సవాలను విజయవంతం చేయడంలో భక్తులందరూ అధికారులకు సహకరించి, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, ఆలయ ఈఓ అనిల్‌కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.