BC Overseas Scheme | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 30 : మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి (బీసీ ఓవర్సీస్) పథకం కింద హనుమకొండ జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎస్ లక్ష్మణ్ తెలిపారు. దరఖాస్తుదారు వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమ్యూనిటీకి చెందినవారై ఉండాలని, విద్యార్థి వయస్సు 35 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలన్నారు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలని, అన్ని వనరుల నుంచి సంవత్సరానికి రూ.5 లక్షలు మించకూడదన్నారు. పీజీ కోర్సులకు అర్హత 60 శాతం మార్కులు లేదా ఫౌండేషన్‌లో తత్సమాన గ్రేడ్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ప్యూర్ సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, మెడిసిన్ అండ్ నర్సింగ్, సోషల్ సైన్సెస్, మానవీయశాస్త్రంలో గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశపత్రం, విద్యార్థులు చెల్లు బాటయ్యే పాస్‌పోర్టు కలిగి ఉండాలన్నారు. టోఫెల్, జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్, జిమ్యాట్, పీటీఈలలో ఏదేని రెండు పరీక్షలలో కనీస టోఫెల్-60, ఐఈఎల్టీఎస్-6.0, జీఆర్ఈ-260, జీమ్యాట్-500, పీటీఈ-50 స్కోర్ ఉండాలని, కేవలం సీవోఈ/ఐ-20, వీసా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఉచిత విదేశీ విద్య అనుమతి దేశాలివే..
ఉచిత విదేశీ విద్య అనుమతి దేశాలు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణకొరియాలో మాత్రమేనన్నారు. మీ-సేవా జారీ చేసిన కుల, ఆదాయ (ఏప్రిల్-2025 నుంచి), జనన ధువ్రీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, నేటివిటీ సర్టిఫికెట్, నివాస, పాస్‌పోర్టు కాపీ, వీసా కాపీ, ఎస్ఎస్సీ, ఇంటర్, గ్రాడ్యుయేట్, పీజీ స్థాయి నుంచి మార్క్‌షీట్, చెల్లుబాటయ్యే టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, జీమ్యాట్ స్కోర్‌కార్డు, విదేశీ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ ఆఫర్ లెటర్-ఐ20, లెటర్ ఆఫ్ అడ్మిషన్ లేదా తత్సమానం, బ్యాంకు పాస్‌బుక్ కాపీ, ఫొటోగ్రాఫ్, ఏదైనా ఇతర పత్రాలతో www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Harish Rao | పెట్రోల్‌కు రేవంత్ డబ్బులు ఇస్తున్నాడా..? పోలీసులకు హరీశ్‌రావు సూటి ప్రశ్న
పార్టీ మారితేనే సహకారం.. లేదంటే తిరస్కారం..