Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి దాదాపు రూ.14 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన గంటలోనే దాదాపు రూ.7.6 లక్షలు మార్కెట్ నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 2496.89 పాయింట్ల నష్టంతో 74,207.24 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 2700 పాయింట్ల మేర కనిష్టాన్ని తాకింది.
మరోవైపు నిఫ్టీ కూడా భారీ నష్టాల్ని చవిచూసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 775 పాయింట్లు నష్టపోయి 23,002 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు 3.26 శాతం నష్టాల్ని నమోదు చేశాయి. వరుసగా మూడు రోజులు లాభాలు చవిచూసిన మార్కెట్లు నాలుగో రోజైన గురువారం మాత్రం భారీ పతనాన్ని నమోదు చేశాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల విలువ రూ.438.63 లక్షల కోట్లు ఉండగా, గురువారం దాదాపు రూ.14 లక్షల కోట్లు నష్టపోయింది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం, గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు వంటి అంశాలు మార్కెట్‌కు ప్రతికూలంగా మారాయి. ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాత్కాలిక ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేయడంతో ఆ బ్యాంకు షేర్లు దాదాపు 9 శాతం పతనమయ్యాయి. ఇది కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించింది.
మరోవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గురువారం బ్యారెల్ క్రూడాయిల్ ధర 114 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు 90 డాలర్ల వద్ద ఉన్న చమురు ధర ఇప్పుడు గణనీయంగా పెరిగింది. అలాగే అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ నిర్ణయం కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఉద్రిక్తతల వేళ కూడా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించకపోవడం ప్రతికూలంగా మారింది. బుధవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం కూడా భారత మార్కెట్లను శాసించింది.