భీమదేవరపల్లి, ఏప్రిల్ 15: మండలంలోని ముల్కనూరు స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో మంగళవారం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవతరగతి(1998-99) చదువుకున్న రోజుల్లో గడిపిన మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తప్పు చేస్తే దండించిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. చిరిగిన చొక్కా అయినా వేసుకో మంచి బుక్కు కొనుక్కో అంటూ తమను క్రమశిక్షణకు మారుపేరుగా మార్చిన ప్రతి గురువుకు పేరు పేరునా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తరగతి గదుల్లో ఆడిన ఆటలు, పాటలు, ఆకతాయితనంతో చేసిన చిలిపి చేష్టలను గూర్చి సరదాగా మాట్లాడుకున్నారు.
ఇక్కడనే పుట్టి ఎక్కడెక్కడో స్థిరపడిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కష్టం వస్తే తోబుట్టువులుగా మేము ఉన్నామని చిన్ననాటి స్నేహితురాల్లకు భరోసా ఇచ్చారు. మీ ఇంట్లో పండుగలు జరిగితే పిలవకున్న పరవాలేదు కానీ కష్టం వస్తే అన్నయ్య అని పిలవండి అండగా నిలబడతాం అంటూ ఒకరినొకరు కన్నీళ్లు పెట్టుకున్నారు. బరువెక్కిన హృదయాలతో చిన్ననాటి స్నేహితులు నిష్క్రమించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, ఆంజనేయులు, కృష్ణమూర్తి, నాగేశ్వర్, రాజన్న, చంద్రయ్య, మహిపాల్, చిన్ననాటి స్నేహితులు మాడుగుల నవీన్ కుమార్, ప్రసాద్, భైరీ రాంబాబు, శంకరాచారి, రజనీకాంత్, ప్రేమ్ సాగర్, శ్రావణ్, అనిత, మూల రాధిక, సంధ్య, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.