హనుమకొండ చౌరస్తా, జూన్ 9: జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) 2026 కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) మంగళవారం అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. సంస్థలోని విద్యాప్రమాణాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పరిశోధన అవకాశాలు, విద్యార్థి జీవనం, అలాగే అద్భుతమైన ప్లేస్ మెంట్ అవకాశాల గురించి వివరించారు.
విద్యార్థులు తమ భవిష్యత్తుకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. డీన్ (అకాడెమిక్) ప్రొఫెసర్ వెంకయ్య దరి సంస్థలోని విద్యా కార్యక్రమాలు, అకాడమిక్ అవకాశాల గురించి వివరించగా, ప్రవేశాల ఇన్చార్జి ప్రొఫెసర్ రాంరెడ్డి జోసా కౌన్సెలింగ్, ప్రవేశ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులతో నేరుగా మాట్లాడి విద్యా కార్యక్రమాలు, ప్లేస్మెంట్లు, హాస్టల్ సౌకర్యాలు, విద్యార్థి జీవనం తదితర అంశాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.