వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 6,64,188 మంది ఓటర్లలో 3,63,573(54.74 శాతం) మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీడబ్ల్యూఎంసీకి ఏప్రిల్ 30న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వరంగల్ నగరానికి సమీపంలోని రాంపూర్‌లో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఆరు స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ బాక్సులను తరలించారు.
66 వార్డుల్లోని ఓట్ల లెక్కింపును మూడు బ్లాక్‌లుగా విభజించారు. లెక్కింపు సజావుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదటగా బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ప్రతీ డివిజన్‌కు రెండు టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 1900 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ ఆర్వో లెక్కింపును పర్యవేక్షించనున్నారు.
ఓట్ల లెక్కింపునకు భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ తరుణ్ జోషీ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పోలింగ్ సిబ్బంది, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లకి కొవిడ్ పరీక్షలను పూర్తిచేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది.