Bheemadevarapally | భీమదేవరపల్లి, డిసెంబర్ 7 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శిక ప్రదీప్ అడ్వకేట్ విధులను వదిలి సర్పంచ్ పోటీలో నిలించారు. శిక ప్రదీప్ తండ్రి జేమ్స్ సైతం అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు. ఆయన తాత శిక వీరయ్య స్వాతంత్ర్య సమరయోధులు. పుట్టిన గ్రామంపై మమకారంతో తాను సర్పంచ్ బరిలో నిలిచానని తెలిపారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో మురికి కాలువలు, సీసీ రోడ్లు ప్రధాన సమస్యగా మారిందన్నారు. మురికి కాల్వల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, బతుకమ్మ బండ అభివృద్ధి, ఎస్‌హెచ్‌జీ మహిళలకు శాశ్వత భవన నిర్మాణం, మోడల్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణం, వెటర్నరీ భవన నిర్మాణాలను ప్రభుత్వ నిధులతో, దాతల సహకారంతో నిర్మిస్తానన్నారు. కాతూరి మోత్కులు నుంచి అంబేద్కర్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో వీధిలైట్ల విస్తరణ, తాగు నీటి ఎద్దడి నివారణ చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని చెప్పారు. విద్యావంతుడిగా తనను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిందని, ప్రజలు సర్పంచ్‌గా తనను ఆశీర్వదించాలని కోరారు.