హనుమకొండ చౌరస్తా, నవంబర్ 12 : ‘వరంగల్ నగరం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా హనుమకొండ జిల్లాను ఎడ్యుకేషన్, ఐటీ, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు’ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లోని హ్యాండ్‌బాల్ క్రీడా ప్రాంగణంలో 30వ సీనియర్ సౌత్‌జోన్ జాతీయస్థాయి ఖోఖో పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందన్నారు. జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు వరంగల్ ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఖోఖో క్రీడాకారులు పాల్గొని, వారి ప్రతిభ చాటుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తోందన్నారు. డిసెంబర్ 2 తర్వాత అసోసియేషన్‌లోని సీనియర్ క్రీడాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, స్పోర్ట్స్ క్యాలెండర్‌ను రూపొందిస్తామన్నారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగిన రంజిత్‌కు అండగా ఉంటానని వినయ్‌భాస్కర్ హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
వరంగల్ వేదికగా జాతీయ క్రీడలు జరుగడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కార్యదర్శి తోట శ్యాంప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు 210 మంది టెక్నికల్ అఫిషియల్స్ పాల్గొన్నట్లు తెలిపారు. వారికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చినవారు త్వరలో జరిగే ఫెడరేషన్ కప్‌లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కోట్ల రామకృష్ణ, తమిళనాడు ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి నెల్సన్ సామిల్, సౌత్‌జోన్ ఖోఖో కమిటీ చైర్మన్ ఎం సీతారామిరెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మంచాల స్వామిచరణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, నల్గొండ కార్యదర్శి ఎన్ కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ అతికుల్లా, ఉపాధ్యక్షుడు కత్తి కుమారస్వామి, ఖమ్మం అధ్యక్షుడు పీ రామయ్య, నిజామాబాద్ కార్యదర్శి జీ సాగర్‌రెడ్డి, వీర రాఘవయ్య, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ కోశాధికారి బన్న విజయ్‌కుమార్, హ్యాండ్‌బాల్ కోచ్ బొడ్డు విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాచ్‌ల వివరాలు
పురుషుల జట్టు
కర్ణాటక-తెలంగాణ జట్లు పోటీ పడగా (19-16) కర్ణాటక 3 పాయింట్లతో గెలుపొందింది.
కేరళ-ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడగా (15-14) కేరళ ఒక పాయింట్‌తో గెలిచింది.
మహిళల జట్టు
కేరళ-తెలంగాణ జట్లు తలపడగా (10-09) కేరళ నాలుగు పాయింట్లతో గెలుపొందింది.
కర్ణాటక-తమిళనాడు పోటీ పడగా(13-08) కర్ణాటక ఐదు పాయింట్లతో విజేతగా నిలిచింది.