పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం పెద్దోళ్ల జేబులు నింపుతున్నాయి. ప్రతిరోజు టన్నులకొద్ది రేషన్‌బియ్యం అక్రమ రవాణా చేస్తూ అక్రమార్కులు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఈ దందాను కట్టడి చేయాల్సిన అధికారులు అక్రమార్కులకు వంతపాడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం రాగానే విజిలెన్స్, సివిల్ సైప్లె, పోలీసు అధికారులు ఆగమేఘాల మీద అక్కడికి చేరుకుంటున్నారు. నామమాత్ర చర్యలు తీసుకుని, ఆపై వ్యాపారులతో డీల్ చేసుకుని గప్‌చుప్ అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అందోల్, ఫిబ్రవరి 26 : రేషన్ బియ్యం కొనుగోలు చేసి నిల్వపెట్టారనే సమాచారంతో జనవరి నెలలో జోగిపేటలోని ఓ రైస్‌మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశా రు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో బియ్యం(నూక) బస్తాలు పట్టుకున్నారు. దీనిపై జోగిపేట పోలీసులకు విజిలెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారు. జోగిపేట ఎస్సై, పలువురు పోలీస్ సిబ్బంది రైస్‌మిల్లుకు చేరుకుని యజమానితో మాట్లాడారు. బియ్యం, ఇతరత్రా వివరాలు నమోదు చేసుకుని సివిల్ సైప్లె అధికారులు వచ్చే వరకు ఆ బియ్యాన్ని అక్కడే ఉంచాలని చెప్పి మిల్లుకు తాళంవేసి వెళ్లారు.
ఆ తర్వాత సివిల్ సైప్లె అధికారులు మిల్లుకు వచ్చారో లేదో తెలియదు. దీనిపై పోలీసులను అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారు..? విజిలెన్స్ అధికారులు పోలీసులకే తెలుసు అనడం ఇలా ఒకరిపై ఒకరు నెపం వేసుకుం టూ పట్టుకున్న బియ్యం సంగతి ఏమైందో చెప్పడం లేదు. ఈ మిల్లులో జరిగిన తతంగంలో అధికారులు మాత్రం లాభపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి.
కొన్ని నెలల కిత్రం అందోల్ నియోజకవర్గంలోని అల్లాదు ర్గం మండలంలోని ఓ రైస్‌మిల్లులో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు టన్నుల కొద్ది రేషన్‌బియ్యాన్ని పట్టుకున్నారు. మిల్లులో సోదాలు జరుగుతుండగా అధికార పార్టీ నాయకుడు ఒకరు అధికారులకు ఫోన్‌చేసి మిల్లుపై, యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చక్రం తిప్పారు. అందుకు ప్రతిఫలంగా అధికారులకు పెద్ద మొత్తంలో నజరానాలు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజా గా అదే మిల్లుకు సంబంధించి అల్లాదుర్గం శివారులో అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు.
దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇవే కాకుండా అం దోల్, వట్పల్లి, పుల్కల్, చౌటకూర్ మండలాలు, కంకోల్ టోల్‌ప్లాజా వద్ద సైతం భారీగా రేషన్ బియ్యం పటుడుతున్నా కనీస చర్యలు ఉం డడం లేదు. పట్టుబడుతున్న ఈ రేషన్ బియ్యం పలు గ్రామాల్లోని రైస్‌మిల్లులకు చేరుతున్నాయనేది బహిరంగ రహస్యం. రైస్‌మిల్లులకు తరలించే క్రమంలో ఎవరైనా సంబంధిత అధికారులకు ఫోన్చేయగానే ఆనవాయితీ ప్రకారం అక్కడికి రావ డం, హడావిడి చేయడం అధికారులకు మామూలై పోయింది. బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు..? ఎక్కడికి తరలిస్తున్నారు..? ఈ దందాలో ఎవరెవరి పాత్ర ఉంది..? అనే విషయాలేవి పట్టించుకోకుండా తెలివిగా లారీ డ్రైవర్‌పై కేసు నమోదుచేసి చేతులు దులుపుకొంటున్నారు. ఆ తర్వాత ఆ బియ్యం ఎక్కడికి చేరాయి అనేది మాత్రం గండికోట రహస్యంగా మిగిలిపోతున్నది.
ఇప్పటి వరకు పట్టుబడిన బియ్యం కేసులను ఓసారి పరిశీలిస్తే, అన్నిట్లో లారీల డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఉన్నాయి తప్పా.. అమ్మిన, కొన్నవారిపై ఒక్క కేసుగానీ, వారిపేరు గానీ బయటకు రాలేదంటే అధికారులు వారికి ఎంతలా సపోర్టు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు, అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తున్నాయి. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు అధికారుల తీరు ఉండడంతో రేషన్ అక్రమ రవాణా దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా కొనసాగుతున్నది.
రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న రైస్‌మిల్లుల నిర్వాహకులు, వ్యాపారులు వాటిని నూకగా మార్చుతున్నారు. జనవరిలో జోగిపేట మిల్లులో పట్టుబడిన రేషన్‌బియ్యాన్ని సైతం నిర్వాహకులు నూకగా మార్చి బస్తాల్లో నింపిపెట్టారు. నూకగా మార్చితే ఎవరికీ అనుమానం రాదనేది వ్యాపారుల ఎత్తుగడ. దీంతో టన్నులకొద్ది రేషన్ బియ్యాన్ని నూకగా మార్చి కొత్తదారుల్లో అక్రమ దందా చేస్తున్నారు. జోగిపేట పట్టణంలో కొందరు వ్యాపారులు యథేచ్ఛగా రేషన్‌బియ్యం తక్కువ ధరకు కొంటూ ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వీరు కూడా ఆ బియ్యాన్ని నూకగా మార్చి విక్రయిస్తున్నారు. ఇదంతా ప్రధాన రహదారి పక్కనే జరుగుతున్నా స్థానిక అధికారులకు కనబడకపోవడం విమర్శలకు తావిస్తున్నది. జిల్లా అధికారులైనా రేషన్ అక్రమ దందాపై నిఘా పెట్టి దారిమల్లకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.