హనుమకొండ, మే 28 : హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం నిర్వహించిన సమీక్ష తూతూ మంత్రంగా జరిగింది. మూడు గంటల పాటు నిర్వహిస్తామని చెప్పిన మంత్రులు అరగంటలోనే ముగించారు. తమ తప్పులను అధికారులపైకి నెట్టేసేలా సమీక్ష కొనసాగడం విశేషం. కాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏకరవు పెట్టారు.
స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ కాంటాలైన బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయని, మిల్లులకు తరలించలేదని, లారీల కొరత, గన్నీ సంచులు, గోడౌన్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షం వస్తే ఇబ్బందులు తప్పవని, వెంటనే తరలించకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ధాన్యం తరుగు ఎక్కువగా తీస్తున్నారని, ప్రభుత్వ లక్ష్యాన్ని అధికారులు లైట్‌గా తీసుకుంటున్నారని ఆరోపించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో గన్నీ సంచుల కొరత ఉందని, 60 వేలకు కేవలం 20 వేలు మాత్రమే ఇచ్చారని, 40 వేల బ్యాగులు రైతులు కొనుగోలు చేసి నెల రోజులవుతున్నా ఇప్పటి వరకు డబ్బులివ్వలేదన్నారు.
అలాగే రైతులు ట్రాన్స్‌పోర్టు చేస్తే రూ. 36 ఇవ్వాల్సిన కాంట్రాక్టర్ కేవలం రూ. 25 మాత్రమే ఇస్తున్నారనిన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల రేగొండ, మొగుళ్లపల్లి నుంచి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు మక్కలు తీసుకురావడంతో రైతులు ఇబ్బందులు పడి ధర్నా చేస్తే సమస్యను పరిష్కరించామన్నారు. మార్కెట్లో ఇంకా మక్కలున్నాయని, వెంటనే కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఫైనాన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, హనుకొండ, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద, బోర్కడే హేమంత్ సహదేవరావు, సందీప్ కుమార్ ఝా, డీసీపీ దార కవిత, అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన సమీక్షకు మంత్రులు కొండా సురేఖ, సీతకతో పాటు ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, మురళి నాయక్, యశస్వినిరెడ్డి హాజరు కాలేదు. సురేఖ, సీతక్క జిల్లాలోనే ఉన్నప్పటికీ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అధికారులు తమాషాలు చేయకుండా ప్రొక్యూర్మెంట్ చేయాలని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆర్డీవోలు, సివిల్ సప్లయ్స్, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒక్క గింజ మిగలకుండా కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలన్నారు. వివిధ కారణాలతో రైతులను ఇబ్బందులు పెట్టే మిల్లరపై చర్యలు తీసుకోవాలన్నారు.
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు చెప్పిన వివరాల్లో చాలా వ్యత్యాసం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అధికారులు ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని, నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నందున జూన్ 4లోగా ధాన్యం, మక్కల కొనుగోళ్లు, తరలింపు పూర్తి చేయాలన్నారు. ఇకపై ప్రతి వాహనాన్ని ధాన్యం సరఫరాకు మళ్లించాలన్నారు. తాలు, తరుగు విషయంలో మిల్లర్లతో మాట్లాడాలన్నారు. గన్నీల కొరత లేదని, తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామన్నారు. యాసంగిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటి వరకు 58 లక్షల ఎంటీలు కొనుగోలు చేసి, 8.5 లక్షల మంది రైతులకు రూ. 10,500 కోట్లు చెల్లించామన్నారు.
-మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి