హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 20: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల సాధనకు ఈనెల 23న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు, ఈ ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పీసీ రాష్ట్ర నాయకులు చావ రవి, టి.లింగారెడ్డి, ఎన్.తిరుపతి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, చాలా సహనంతో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి అనేకమార్లు తీసుకువచ్చిన కూడా, మంత్రివర్గ ఉప సంఘం పేరుతో, అధికారుల కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ వస్తున్నదన్నారు.
అనేక ఖాళీలు ఏర్పడి విద్యావ్యవస్థ నిర్వీర్యమయేస్థితి రాష్ర్టంలో నెలకొని ఉన్నదని, పెండింగ్ బిల్స్సంవత్సరాల తరబడి మంజూరుకు నోచుకోవడం లేదన్నారు. చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ గడువు ముగిసి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎలాంటి స్పందన లేదన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాల సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయని, ఉద్యోగుల, పెన్షనర్ల నగదు రహిత వైద్య చికిత్స కోసం చర్యలు చేపడుతామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీటీఎఫ్ రాష్ర్ట కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌రెడ్డి, టీపీటీఎఫ్ రాష్ర్ట కార్యదర్శి ఆర్.రమేష్, జి.ఉప్పలయ్య, బి.శ్రీరామ్, తాటికాయల కుమార్, కే.శ్రీనివాస్, పి.సుజన్ప్రసాద్, ఏ.గోవిందరావు, ఎంఏ బాసిత్, కే.భోగేశ్వర్, ఎం.దామోదర్, పి.మనోజ్, కే.రవిచందర్, బి.రవీందర్, టి.తావు, పట్టాభి పాల్గొన్నారు.