జనగామ, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా విస్తారంగా వానలు పడినా జనగామ ప్రాంతంలో మాత్రం అంతంతే కురిశాయి. వ్యవసాయ సీజన్ మొదలై రెండు నెలలు దాటినా అన్ని పంటల సాగు 50 శాతం లోపే ఉంది. జిల్లాలో 3,25,104 ఎకరాల సాధారణ విస్తీరానికి జూలై 15 నాటికి సాగైంది మాత్రం 1,15,166 ఎకరాలే. అంటే సాధారణ విస్తీర్ణంలో కేవలం 31.17 శాతం మాత్రమే సాగయ్యాయి. 2,15,000 ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 60,130 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అలాగే పత్తి 1,25,000 ఎకరాలకు 75,121 ఎకరాలు, కంది 3,500 ఎకరాలకు 805, పెసర 700 ఎకరాలకు 290 ఎకరాల్లో సాగు చేయగా, ఒక్క మక్కజొన్న మాత్రం 3,670 ఎకరాల సాధారణ విస్తీర్ణాన్ని మించి 6,007 ఎకరాల్లో సాగైంది.
అందులో వర్షాధార పంటలైన పత్తి, మక్కజొన్న, పెసర లాంటి పంటలు ముందుగా సాగుచేసిన రైతులు వ్యవసాయ బావులు, బోర్ల కింద మా త్రమే వరినాట్లు పూర్తి చేయగా..చెరువులు, కుంటల ఆయకట్టు రైతులు మాత్రం ఇప్పుడిప్పుడే నాట్లు మొదలుపెట్టారు. అయితే జిల్లాకు అవసరమైన యూరియా నిల్వలు పూర్తిస్థాయిలో రాకపోవడం, ప్రస్తుత అవసరానికి తగినట్లు సరఫరా లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటున్నది. ఇప్పటికే జిల్లాలోని పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో యూరియా కొరత ఉందనే ఆందోళనతో రైతులు దుకాణాల ముందు బారులుతీరి బస్తాలు కొనుగోలు చేశారు.
తాజాగా శుక్రవారం సాయంత్రం జనగామ జిల్లా కేంద్రంలోనూ ఓ దుకాణం ముందు యూరియా కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. పొరుగు జిల్లాల్లో నెలకొన్న యూరియా కొరత కారణంగా రైతులకు అవసరం ఎంతున్నా ఎకరానికి ఒక బస్తా మాత్రమే ఇస్తామని ఫర్టిలైజర్స్ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో అన్నదాతలకు ఇప్పుడే యూరియా కొరత బెంగపట్టుకుంది. జిల్లాలో 3.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయనే అంచనా మేరకు 26.26 వేల మెట్రిక్ టన్నుల యూరి యా అవసరముంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించింది.
ఇందులో 13.6 వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుకోగా, ఇప్పటికే 12.9 వేల మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ జరిగింది. జిల్లాలో యూరియా నిల్వలు దాదాపు అడుగంటి పోవడంతో అధికారుల ఆదేశాలతో ఒక్కో ఎకరానికి ఒక బస్తా చొప్పున యూరియా అమ్మకాలు జరుగుతుండడం రైతుల ఆగ్రహానికి కారణమవుతున్నది. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరినాట్లు ముమ్మరమంవుతుండగా, ఏపుగా పెరుగుతున్న పత్తి, మక్కజొన్న తదితర పంటలకు తప్పనిసరిగా యూరియా వేయాలని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎకరానికి ఒక బస్తా యూరియా ఏ మూలకు సరిపోతుందని వారు ప్రశ్నిస్తున్నారు. రానున్న వారం, పదిరోజుల్లో పంటల సాగు మరింత పెరిగి యూరియా అనివార్యం కానుండగా, కేటాయింపు మేరకు తెప్పించకుంటే ఇతర జిల్లాల్లో మాదిరిగా జనగామ ప్రాంతంలో కూడా రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.