రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు ఆదివారం తెల్లవారుజామునే యూరియా కోసం తరలివచ్చారు. ఉదయం 7.30 గంటల తర్వాత వ్యవసాయ, సొసైటీ అధికారులు, సిబ్బంది వచ్చి లైన్లో ఉన్న వారికి ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు. ఎకరానికి ఒక బస్తా ఏం చేసుకోవాలని అన్నదాతలు వాపోయారు. చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామంలో యూరియా కోసం సహకార కేంద్రం వద్ద బారులు తీరారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వగ్రామమైన అమీనాబాద్‌లో టోకెన్ల కోసం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. నెక్కొండ సొసైటీలో 444 బస్తాలు నిల్వ ఉండగా, దాదాపు 1000 మంది లైన్లో నిల్చున్నారు. మిగతా వారు ఆగ్రహించగా మంగళవారం మరో 444 బస్తాలు వస్తాయని రైతులను సముదాయించి టోకెన్లు ఇచ్చి పంపించారు. వర్ధన్నపేటలోని రైతు వేదిక వద్దకు వందలాది మంది రైతులు ఉదయం 5 గంటల వరకే రాగా, పీఏసీఎస్ సిబ్బంది కూపన్లు ఇచ్చి బస్తాలు అందజేశారు. చాలా మందికి అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఎకరానికి ఒక బస్తా ఏమూలకు సరిపోతుందని రైతులు వాపోయారు. జనగామ జిల్లా నర్మెట, మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట అన్నదాతలు క్యూ కట్టారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్, పాలంపేట పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట రైతులు నిలబడే ఓపిక లేక చెప్పులను క్యూలో పెట్టారు. మండలానికి 2,750 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 1840 మెట్రిక్ టన్నులే అందుబాటులో ఉందని మండల వ్యవసాయ అధికారి శైలజ తెలిపారు. గోవిందరావుపేట మండలంలోని పీఏసీఎస్ కార్యాలయానికి యూరియా లోడ్‌తో లారీ రాగా, వాటి కోసం రైతులు పోటీ పడ్డారు. గంటల తరబడి ఎండలో పడిగాపులు కాశారు.
పర్వతగిరి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఆదివారం ఉదయం నుంచే ఎరువుల కోసం పట్టాదారు పుస్తకాల లైన్ పెట్టారు. వారం రోజులుగా పడిగాపులు గాస్తున్నా ఒక్క బస్తా దొరకడం లేదని, కాంగ్రెస్ పాలనలో తమకు యూరియా కష్టాలు తప్పడం లేదని రైతులు మండిపడ్డారు. తక్షణమే యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేశారు.
కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి సొసైటీ వద్ద శనివారం రాత్రి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం ముందస్తుగా ఆధార్‌కార్డు, చెప్పులు పెట్టి వాటికి కాపలాగా ఉన్నారు. సద్దులు కట్టుకొని వచ్చి భోజనాలు చేసి అక్కడే నిద్రించారు.