దుగ్గొండి, జులై 05: కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ యూరియా కోసం కష్టాలు పడాల్సి వస్తుంది చెన్నారావుపేట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో రైతులు రెండు రోజులుగా యూరియా కోసం అనేక కష్టాలు పడుతున్నారు. వారం రోజులుగా వేచి చూడగా ఒక లారీ లోడు మాత్రమే సొసైటీకి కేటాయించారు.
యూరియా వచ్చిందని తెలియడంతో పలు గ్రామాల రైతులు ఉదయం నుంచి బారులు తీరి నిల్చున్నారు. ఒక రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో నాలుగు ఎకరాలు సాగు చేస్తున్న రైతు యూరియా కోసం తమ కుటుంబ సభ్యులను తీసుకువచ్చి లైన్లో నిలబెట్టినట్లు తెలిపారు. యూరియా కోసం గత ప్రభుత్వంలో లేని కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ మొదలయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు కావలసినంత యూరియాను అందుబాటులో ఉంచి రైతుల కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.