యూరియా కోసం అన్నదాతలు ఆగమాగవుతున్నారు. రోజుల తరబడి క్యూలో నిల్చోలేక అవస్థలు పడుతున్నారు. టోకెన్లు తీసుకునేందుకూ పడిగాపులు పడుతున్నారు. ఎరువుల లారీ ఎప్పుడొస్తే అప్పుడిస్తామని అధికారులు చెబుతుండగా ఎన్ని రోజులు ఈ తండ్లాటని అన్నదాతలు మండిపడుతున్నారు. సకాలంలో యూరియా అందజేయాలని గోవిందరావుపేటలో రైతులు రోడ్డెక్కగా, రేగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్,ఆగస్టు 31
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. జనగామ జిల్లా పాలకుర్తి ఎఫ్ఎస్సీఎస్ కేంద్రం వద్ద వేలాది మంది ఉదయం 7 గంటల నుంచి పడిగాపులు గాశారు. దీంతో పోలీస్ పహారా మధ్య బ్యాంక్ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ చేశారు. నర్మెట పీఏసీఎస్, చిల్పూరు మండలంలోని మల్కాపూర్ అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద అన్నదాతలు బారులు తీరారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పీఏసీఎస్ వద్ద అదివారం తెల్లవారుజామునే వందలాది మంది రైతులు రావడంతో అధికారులు కూపన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
700 మంది రైతులకు ఒక బస్తా చొప్పున 700 టోకెన్లు ఇచ్చినట్లు వ్యవసాయాధికారి వినయ్‌కుమార్ తెలిపారు. నల్లబెల్లి మండలంలోని మేడెపల్లి, నల్లబెల్లి పీఏసీఎస్‌కు 880 బస్తాల యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు ఉదయం 4 గంటలకే గోదాము వద్దకు వచ్చారు. టోకెన్లు రాంపూర్ రైతు వేదిక వద్ద ఇస్తున్నారని తెలియడంతో అక్కడ క్యూ కట్టారు. ఈ క్రమంలో తోపులాట జరుగగా, విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అక్కడికి చేరుకుని యూరియా దిగుమతిపై ఏవోను ప్రశ్నించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్ పాలనలో అన్నదాత అరిగోస పడుతున్నాడని అన్నారు. గోవిందరావుపేట పీఏసీఎస్‌కు ఉదయం 7 గంటలకే రైతులు చేరుకొని యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు అరగంట పాటు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని, పై అధికారులకు విషయాన్ని తెలుపుతామని పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
రైతు సమస్యలను గాలికొదిలేసిన సర్కారు
రేగొండ, ఆగస్టు 31: రైతు సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి-పరకాల జాతీయ రహదారిపై ఆదివారం ధర్నా నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. యూరియా కోసం రైతులు క్యూలో రోజుల తరబడి నిల్చోడం, చెప్పులు పెట్టడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులు ఎరువులు లేక విత్తనాల దొరకక, పండించిన పంటలు కొనేవారు లేక ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీలు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని యూరియా, విత్తనాల కొరత లేకుండా నిరంతరంగా సరఫరా చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అదేవిధంగా రైతు సమస్యలను పకన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల చేతిలో ఓటమి తప్పదన్నారు. అసెంబ్లీలో యూరియాపై తీర్మానం చేసి చర్చించి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వం గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రేగొండ, గోరుకొత్తపల్లి మండల అధ్యక్షులు అంకం రాజేందర్, హబీబ్, నాయకులు రాజేశ్వరరావు, మహేందర్, కర్ణాకర్ రెడ్డి, నీలాంబరం, సుమన్, భిక్షపతి, పాపిరెడ్డి, చంద్రారెడ్డి, తిరుపతి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జిరాక్స్ ప్రతులను రైతులపైకి విసిరిన ఏవో
శనివారం మరిపెడ మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కి 200 బస్తాల యూరియా వస్తే సుమారు 1000 మంది రైతులు ఉండడంతో అధికారులు పోలీసుల సహాయంతో పంపిణీ చేశారు. ఈ క్రమంలో రైతుల నుంచి వ్యవసాయాధికారి ఆధార్, పట్టా పాస్‌బుక్స్ జిరాక్స్‌లను తీసుకొని కూపన్ ఇస్తానని, రేపు వచ్చి క్యూలో నిలబడి యూరియా తీసుకోవాలని చెప్పారు. దీంతో రైతులందరూ ఒక్క సారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో సహనం కోల్పోయిన ఏవో జిరాక్స్ కాపీలను విసిరేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కిందపడిన ఆధార్, పట్టాపాస్ బుక్స్ జిరాక్స్ పత్రులను రైతులు ఏరుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.