తుపాన్ కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన వరి పంటతో పాటు పత్తి, ధాన్యం తడిసి ముద్దయ్యింది. రెండు రోజులుగా ఆకాశం మబ్బులు పట్టి చల్లగాలులు వీస్తుండడంతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు తడవకుండా పలువురు రైతులు టార్పాలిన్లు కప్పుకున్నారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట, ములుగు జిల్లా ఏటూరునాగారం, గోవిందరావుపేటతో పాటు వాజేడు మండలంలోని ధర్మవరం, వాజేడు, ప్రగళ్లపల్లి తదితర గ్రామాల్లో కురిసిన భారీ వర్షంతో ధాన్యాన్ని ఆరబోసిన రైతులు ఆగమయ్యారు. కోసేందుకు సిద్ధంగా ఉన్న వరి తడిస్తే తీవ్రంగా నష్టపోతామని పలువురు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
– ఏటూరునాగారం/ గోవిందరావుపేట/ వాజేడు/ నర్సింహులపేట/ చెన్నారావుపేట, డిసెంబర్ 1