నర్సంపేట రూరల్, ఏప్రిల్ 24: ఈదురుగాలులతో కూడిన అకాల వడగండ్ల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం ఈదురుగాలు వీచడంతోపాటు వర్షానికి వరి, మక్కజొన్న, మిర్చి తోటలు, మామిడితోటలు దెబ్బతిన్నాయి. మహేశ్వరం, లక్నెపల్లి, వాసవీనగర్, గురిజాల, గుంటూర్పల్లి, చిన్నగురిజాల, జీజీఆర్పల్లి, ముగ్ధుంపురం, రామవరం, మర్రినర్సయ్యపల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వడగండ్ల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలవాలాయి. పలు గ్రామాల్లో కల్లాల్లో మిర్చి తడిసింది.
నేలరాలిన మామిడి కాయల
నల్లబెల్లి: వర్షం రైతాంగానికి తీవ్ర నష్టం మిగిల్చింది. ఆదివారం సాయంత్రం కురువగా వివిధ రకాల పంటలతోపాటు తీవ్ర నష్టం జరిగింది. మండల కేంద్రానికి చెందిన రైతులు గద్దె సారయ్య 4 ఎకరాలు, గొట్టిముక్కుల నాగభూషణం 3 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా ఈదురుగాలులతో మామిడి కాయలన్నీ నేలరాలాయి. 60శాతానికి పైగా మామిడికాయలు నేలరాలడంతో తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కన్నారావుపేటకు చెందిన సంపత్రెడ్డితోపాటు శంకర్ మామిడితోటల్లోని మామిడికాయలు వడగండ్ల వర్షానికి నేలరాలాయి.
విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ
చెన్నారావుపేట: మండల కేంద్రంలోని ఓ వృక్షం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై కూలగా విద్యుత్ సరఫరా నిలిచింది. సోమవారం అధికారులు స్తంభాలు వేసి విద్యుత్ పునరుద్ధరించినట్లు మండల విద్యుత్ అధికారి జోగానంద్ తెలిపారు. జోజిపేట నారాయణతండాలో అల్వాల ఆనందం ఇంటిపై చెట్టు కూలడంతో కప్పు పూర్తిగా ధ్వంసమైంది. చెన్నారావుపేట, ఖాదర్పేట, తిమ్మరాయిన్పహాడ్, జోజిపేట గ్రామాల్లో మక్కజొన్న, వరి పంట పూర్తిగా నేలవాలింది.