హనుమకొండ చౌరస్తా, జూలై 8: కాంగ్రెస్ సర్కారు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. మంగళవారం హనుమకొండలోని కేంద్ర గ్రంథాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు.
అలాగే అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నిరుద్యోగులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారని, ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట మార్చారన్నారు. 18 నెలలుగా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నామని, ప్రస్తు తం ఉన్న జీపీవోల్లో పాతవారిని తీసుకోగా మిగిలిన 7,404 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్నారు.
అలాగే వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించి టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీపీవో నోటిఫికేషన్ ఇస్తామని మూడు నెలలుగా చెప్తున్నా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. గ్రూప్-1లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. మొత్తం 563 పోస్టుల్లో ఇంగ్లిష్ మీడియం వారే 505 పోస్టులకు ఎంపిక కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. వెంటనే గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దుచేసి తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.