గీసుగొండ, మార్చి 31 : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలోని మచ్చాపురం శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణానికి చెందిన పెయింటర్ మడికొండ ప్రభాకర్(27), డిగ్రీ విద్యార్థి ఇమ్మడి సామ్యేల్ (21) శనివారం సాయంత్రం బైక్‌పై వరంగల్‌లో ఉంటున్న తమ బంధువు ఇంటికి వెళ్లారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున నర్సంపేటకు వస్తున్నారు.
ఈ క్రమంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వాహన దారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై జానీపాషా సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించారు. ప్రభాకర్ సోదరుడు రంజిత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రోడ్డు సైడ్ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, ప్రమాదానికి కారణమైన వాహనదారుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.